తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: కేసీఆర్

పర్యాటకం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. పద్మశ్రీ పురస్కారాలపై ప్రధానితో గొడవపెట్టుకున్నానని అసెంబ్లీలో వెల్లడించారు. విమానాశ్రయాలు కట్టుకుంటామన్నా ఆరున్నరేళ్లుగా తేల్చడం లేదంటూ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM KCR IN ASSEMBLY
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు

By

Published : Oct 5, 2021, 5:02 AM IST

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పురాతన కట్టడాలు, అద్భుతమైన వారసత్వ సంపద, కనువిందు చేసే జలపాతాలు అనేకం రాష్ట్రంలో ఉన్నా.. పర్యాటకం సహా పలు అంశాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. పద్మశ్రీ పురస్కారాల విషయంలోనూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ ఇటీవల గొడవ పెట్టుకున్నానని, పద్మశ్రీ పురస్కారాలకు పేర్లను పంపాలా? వద్దా? చెప్పాల్సిందిగా అడిగానని సీఎం తెలిపారు. ‘‘రాష్ట్రంలో అర్హులైన కళాకారులు లేరా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పంపి..పంపి అలిసిపోయి చెబుతున్న మాటలివి’’ అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను నేరుగా కలిసి విన్నవించానని సీఎం వివరించారు. రాష్ట్రంలో అద్భుతమైన కళాకారులున్నారని ఆయన స్పష్టంచేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘తెలంగాణకు ఉజ్వల చరిత్ర ఉంది. జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. సమైక్య రాష్ట్రంలో దాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఆర్డీఎస్‌పై జరిగిన అన్యాయాన్ని ఉటంకిస్తూ ఉద్యమంలో నేను మొదటి పాదయాత్ర.. జోగులాంబ ఆలయం నుంచి గద్వాల వరకూ చేశా. కృష్ణా, గోదావరి పుష్కరాలపైనా ఉద్యమించా. గతంలో ఎస్సారెస్పీ నుంచి నీరు వదిలితే నేరుగా ధవళేశ్వరంలో కలిసేది. ఇప్పుడు 160 కి.మీ. సజీవ ప్రవాహం కనిపిస్తోంది. అక్కడ అభివృద్ధి చేయడానికి చాలా ఉన్నాయని సీఎం తెలిపారు.

త్వరలో పర్యాటకంపై సమగ్ర కమిటీ

విద్యుత్తు, వ్యవసాయం, సాగునీరు విషయాల్లో ఇన్నాళ్లూ ఇబ్బందుల్లో ఉండటంతో పర్యాటకంపై ఎక్కువ దృష్టిపెట్టలేకపోయాం. త్వరలో అన్ని జిల్లాలకు చెందిన శాసనసభ్యులతో సమ్రగ కమిటీని ఏర్పాటు చేస్తాం. మంత్రి ఆధ్వర్యంలో అవసరమనుకుంటే పర్యటనలు చేసి.. కోటలు, చారిత్రక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, విశిష్ట ప్రాచుర్యం ఉన్న దేవాలయాలను ప్రపంచానికి తెలియజెప్పేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరు శాసనసభ్యులూ తమ నియోజకవర్గాల పరిధిలో గతంలో విస్మృతికి గురైన చారిత్రక ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో.. వాటిని గుర్తించి మంత్రికి సమాచారమివ్వాలి. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రితోనూ గొడవపడ్డాను. వాళ్లకు ఎందుకో ఏమో మన మీద దృష్టి రావడం లేదు. అవసరమైతే ఒకసారి గలాటా పెట్టుకోవాలా? అనేది అర్థమవడం లేదు. విమానాశ్రయాలు కావాలని అడిగాం. మీరు అనుమతిస్తే మా డబ్బుతో మేమే కట్టుకుంటామన్నా ఆరున్నర సంవత్సరాలుగా సాంకేతిక పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మొన్న దీనికి సంబంధించిన మంత్రి వస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చెప్పాం. ఇప్పుడు వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు వస్తోంది. మామునూరులో విమానాశ్రయం వస్తే.. రాదల్చుకున్నవారు నాగ్‌పుర్‌, ముంబయి, కేరళ తదితర ప్రాంతాల నుంచి వరంగల్‌కు నేరుగా వస్తారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు పోవడానికి విమానం అక్కర్లేదనే నెపంతో కాలయాపన చేయకండి అని కూడా చెప్పా. అవసరమైతే కేంద్రంతో మరోసారి గట్టిగా మాట్లాడదాం. ఇవన్నీ చేయించుకుందాం’’ అని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణకు ఉజ్వలమైన చరిత్ర ఉంది. విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, కళలతో కూడుకున్న ప్రాంతమిది. ఇదంతా చారిత్రక ప్రదేశం. విశేషమైన అటవీ సంపద ఉంది. పురాతన కోటలు అనేకం రాష్ట్రంలో ఉన్నాయి. 58 ఏళ్లుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది.

- సీఎం కేసీఆర్‌

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details