CM KCR comments on BRS: సుముహూర్తంలో భారత్ రాష్ట్ర సమితి అవతరించిందని.. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సంచలనం సృష్టించడం ఖాయమని గులాబీ దళపతి కేసీఆర్ మంత్రులతో అన్నట్లు తెలిసింది. ఆవిర్భావ వేడుకలు ముగిసిన వెంటనే దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతాయని చెప్పారు. దేశంలో రాజకీయ శూన్యతను బీఆర్ఎస్ మాత్రమే పూడ్చగలదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైందని కేసీఆర్ వివరించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో.. జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని.. మాజీ సీఎం కుమారస్వామికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.
కర్ణాటకలో దాదాపు పది జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని.. ఊహించని విధంగా బీఆర్ఎస్ స్థానాలు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఏర్పాటులోనూ బీఆర్ఎస్ పాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. ఇటీవలి ఎన్నికల్లో గుజరాత్‌లో మాత్రమే బీజేపీకు మంచి ఫలితాలు వచ్చాయని.. హిమాచల్‌ప్రదేశ్‌ను కోల్పోయిందన్నారు. ఉప ఎన్నికల్లోనూ బీజేపీకు చేదు ఫలితాలే వచ్చాయని చెప్పారు. మున్ముందు బీజేపీకు మరిన్ని కష్టాలు వస్తాయని.. కర్ణాటకపైనా ఆ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ నిర్వాకాలపై మరిన్ని నిజాలు బయటికి వస్తాయని.. బీఆర్ఎస్ ఆవిర్భావంతో కాంగ్రెస్‌లో కలవరం ఏర్పడిందన్నారు.