CM Kcr Comments at Iftar Dinner in LB Stadium: దేశం సరైన నాయకుడు, పార్టీ కోసం ఎదురుచూస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని... గంగజమునా తెహజీబ్ సంస్కృతిని కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో దావత్ ఏ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
కేంద్రంలోని ప్రభుత్వం.. రాష్ట్రప్రభుత్వం తరహాలో సమర్థంగా పనిచేసి ఉంటే... తెలంగాణ జీఎస్డీపీ మరింత ప్రగతిలో ఉండేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం 9ఏళ్లలోనే 12వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో దేశంలో అగ్రగ్రామిగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నివారించామని తెలిపిన సీఎం కేసీఆర్... నిరుద్యోగం కూడా తగ్గినట్లు తెలిపారు.
ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందాం : దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని... ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఘన స్వాగతం లభించిందన్న కేసీఆర్.. నడిపించే సరైన నేత కోసం దేశం ఎదురుచూస్తోందన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.