తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: రైతు బీమా తరహాలో మరో కొత్త పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం - గిరి పోషణ పథకం

Insurance for Toddy Tappers in Telangana: కల్లు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు బీమా తరహాలో వీరి కోసం ప్రత్యేక బీమాను రూపొందిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని ఆర్థిక, ఎక్సైజ్ శాఖల మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్​ను ఆదేశించారు. మరోవైపు 'గిరి పోషణ పథకం' ద్వారా పౌష్టికాహార పంపిణీ మరింత సమర్థంగా అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు.

cm kcr
cm kcr

By

Published : May 2, 2023, 9:54 PM IST

Insurance for Toddy Tappers in Telangana: రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. గీత కార్మికుల బీమా అంశంపై చర్చించారు.

వారం రోజుల్లో గీత కార్మికుల కుటుంబాలకు బీమా:కల్లు గీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారి పడి.. ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట ఘటనలు జరుగుతుంటాయన్న సీఎం.. ఇలా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న పరిహారం.. బాధితులకు చేరడంలో జాప్యం జరుగుతోందని తెలిపిన సీఎం కేసీఆర్.. రైతు బీమా తరహాలోనే వారం రోజుల్లో గీత కార్మికుల కుటుంబాలకు బీమా సొమ్ము అందే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని ఆర్థిక, ఎక్సైజ్ శాఖల మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్​ను కేసీఆర్ ఆదేశించారు. అదే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

మరోవైపు గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం పట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి.. బీమా నిర్ణయంతో కల్లు గీత వృత్తికి పూర్వ వైభవం వస్తుందన్నారు.

ఆ సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చారు: 'గిరిపోషణ పథకం' ద్వారా పౌష్టికాహార పంపిణీ మరింత సమర్థంగా అందించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల కార్యదర్శులు క్రిస్టినా, భారతి హోలికేరీతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. చెంచు చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిపోషణ కార్యక్రమం చేపట్టారని సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని, మారుమూల ప్రాంతాల్లో మరింతగా అవగాహన చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు.

కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలకు బ్రేక్: బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలు జరగవని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలకు బ్రేక్ పడిందని.. సీఎం కేసీఆర్ పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి అన్నారు. అంగన్​వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సైతం అంగన్​వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసుకొని వెళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లల విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించాలని... బరువు తక్కువ ఉన్న పిల్లలకు మరింత పటిష్ఠమైన పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పారు. అన్ని అంగన్​వాడీ కేంద్రాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details