ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లతో పాటు చిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో సోమవారం ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్‌సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. 12 నెలల బకాయిలు చెల్లిస్తామని, పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి వీటిని పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నామన్నారు.
‘‘ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కుచార్జ్‌డ్, డెయిలీ వేజ్ ఉద్యోగుల వేతనాలనూ పెంచుతున్నాం. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 9,17,097 మంది ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి.
- గత ఎన్నికల హామీకి కట్టుబడి పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలు చేస్తున్నాం. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల నుంచే ఇది వర్తిస్తుంది.
- పదవీ విరమణ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతున్నాం. విశ్రాంత ఉద్యోగులు 15 శాతం అదనపు పింఛను (అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్) పొందే అర్హత వయసును 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తున్నాం.
- విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛను విధానం వర్తింపజేస్తాం.
- వేతన సవరణ సంఘం సిఫార్సు మేరకు ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య సేవల పథకం (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం) నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని నియమిస్తున్నాం.
- ప్రాథమిక పాఠశాలల్లో పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమాన స్థాయి) పోస్టులను మంజూరు చేస్తాం.
ఏపీకి వెళ్లే వారికి అవకాశం
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం.కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పిస్తాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100శాతం అర్హులైన ఉద్యోగులందరూ పదోన్నతులు పొందుతారు.
* పదోన్నతుల అనంతరం ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది.
* గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా (మేనేజ్‌మెంట్‌వైజ్) అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియ చేపడతాం.