రాష్ట్రంలో లాక్‌డౌన్ వద్దనుకున్నా... ప్రజల ఆరోగ్య సంక్షరణ కోసం తప్పనిసరై కొనసాగించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదాయం తగ్గినా పౌరుల ప్రాణాలే ముఖ్యమని, అందుకే కఠిన చర్యలకూ వెనుకాడటం లేదని అన్నారు. కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొంటూనే వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తామని చెప్పారు. సాగునీటి వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తామన్నారు. మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు, ఆమోదాల అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడారు. గత 18 రోజుల వ్యవధిలో భారీగా ఆదాయం పోయింది. అందుకే మళ్లీ రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నాం. భూములు, ఇళ్ల అమ్మకాలకు అనుమతించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఫలితాలు
కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్న ఆయన.. మంత్రులు జిల్లాల్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించడం వల్ల మేలైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. వారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని.. లాక్‌డౌన్ ముగిసే వరకు జిల్లాల్లో ఉండి రోగులకు వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అందరికీ, అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగస్వాములు కాకుండా కొంత మంది అత్యాశతో, స్వార్థంతో సొంతదారి వెతుక్కొని కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. అది వారి ఖర్మ.
- సీఎం కేసీఆర్