తెలంగాణ

telangana

ETV Bharat / state

Jagan Delhi Tour: 'విశాఖ ఉక్కుపై పునరాలోచించండి'

ఆంధ్రప్రదేశ్​ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ (Vishakha steel Privatization)పై పునరాలోచించాలని కేంద్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగించవద్దని కోరారు. దిల్లీ పర్యటనలో ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan‌), పీయూష్‌ గోయల్‌(Piyush Goyal)ను కలిసిన ఆయన... పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు, రేషన్‌ బకాయిల చెల్లింపు సహా ఆయా శాఖల పరిధిలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

jagan
jagan

By

Published : Jun 12, 2021, 8:11 AM IST

ఆంధ్రప్రదేశ్విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan‌)కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి(CM Jagan) విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో రెండో రోజైన శుక్రవారం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan‌), పీయూష్‌ గోయల్‌(Piyush Goyal)ను జగన్​ కలిశారు. ఆయా శాఖల పరిధిలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్కు శాఖ మంత్రిని ఆయన నివాసంలో జగన్​ కలిశారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కర్మాగారం కింద రూ.లక్ష కోట్ల విలువైన 19,700 ఎకరాల భూమి ఉందని తెలియజేశారు. 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్నా 6.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతోనే కర్మాగారం నడుస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

గతేడాది డిసెంబరు నుంచి నెలకు రూ.200 కోట్ల లాభాలతో కర్మాగారం నడుస్తోందని, ఇలాగే కొనసాగితే రెండేళ్లలో పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు. విశాఖ ఉక్కు.. ముడి ఇనుమును జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) పరిధిలోని బైలదిల్లా గనుల నుంచి టన్ను రూ.5,260కు కొనుగోలు చేస్తోందన్నారు. ఇతర కంపెనీలు సొంత గనుల నుంచి ముడి ఇనుమును తీసుకుంటుంటే విశాఖ ఉక్కు ఎన్‌ఎండీసీ నుంచి అదనపు ధరకు కొనాల్సి రావడం భారంగా మారిందని తెలిపారు. ఒడిశాలో ఉన్న ఇనుప గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చడంతో పాటు సొంత గనులు కేటాయిస్తే కర్మాగారం లాభాలబాట పడుతుందని చెప్పారు. కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో ఏడు వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కర్మాగారం ఉత్పత్తి చేసి లక్షలాది మంది ప్రాణాలు నిలిపిందని జగన్‌ వివరించారు.

పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుకు డీపీఆర్‌

ఆంధ్రప్రదేశ్​ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి జగన్​ విజ్ఞప్తి చేశారు. రూ.32,900 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను హెచ్‌పీసీఎల్‌- గెయిల్‌ తయారు చేశాయన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏటా రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్ల పాటు సమకూర్చాలని కేంద్రం కోరిందని, అంత మొత్తాన్ని భరించే స్థితిలో ఏపీ లేదని జగన్​ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు విధివిధానాలపై చర్చకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్యాచరణ బృందం సభ్యులను నియమించామన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ తరపున బృందం సభ్యులను నియమించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌తో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో వచ్చే వారమే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం శాఖ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని, ప్రాజెక్టు ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Dharmendra Pradhan‌) హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దిల్లీ పర్యటనలో జగన్‌ వెంట వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మార్గాని భరత్‌, రెడ్డప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లారు.

రేషన్‌ భారం.. మోయలేం

జాతీయ ఆహార భద్రత చట్టంలో హేతుబద్ధత లేని పరిమితి కారణంగా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రేషన్‌ భారం మోయాల్సి వస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌(Piyush Goyal) దృష్టికి తీసుకెళ్లారు. 2015 డిసెంబరు తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడంతో రాష్ట్రానికి బియ్యం కేటాయింపులు 1,85,640 మెట్రిక్‌ టన్నుల నుంచి 1,54,148 మెట్రిక్‌ టన్నులకు తగ్గాయని వివరించారు. ఏపీ కన్నా ఆర్థికంగా వృద్ధి చెందిన కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రలతో పోల్చినా తాము ఎక్కువ భారం మోయాల్సి వస్తోందన్నారు. సమస్యను పరిష్కరించి రాష్ట్రంపై రేషన్‌ భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థకు కేంద్రం చెల్లించాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ ఏపీ ముఖ్యమంత్రి కోరారు.

ఇదీ చదవండి:పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు!

ABOUT THE AUTHOR

...view details