ఎగుమతుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవ్-2021 (AP CM Jagan Launch Vanijya utsav)ని ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని సీఎం తిలకించి.. ఎగ్జిబిషన్ హాళ్లను పరిశీలించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు. చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించడమే వాణిజ్య ఉత్సవ్ (Vanijya utsav) లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సహకారంతో ట్రేడ్ ఎక్స్‌పోర్ట్ కార్నివాల్ (Trade Export Carnival) పేరిట వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాణిజ్య ఉత్సవాలను నిర్వహిస్తారు.
'భారత రాయబార కార్యాలయం ప్రతినిధులకు ధన్యవాదాలు. రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమం జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రభుత్వమే నేరుగా ఎగుమతిదారుల వద్దకు వెళ్తుంది. అవకాశాలను విశదీకరించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.'- సీఎం జగన్
ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 ఏళ్ల ఉత్సవం సందర్భంగా వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో వృద్ధి చెందాయని.. పారిశ్రామిక కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని జగన్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of doing business)లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. రెండేళ్లలో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 8 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.