ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎందరో త్యాగం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి నేటికి 64 ఏళ్లు పూర్తైందని..అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్యాగాన్ని స్మరించుకుంటూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. 1956 నవంబర్ 1న రాష్ట్రం ఏర్పడటం వెనుక గొప్ప చరిత్ర ఉందన్నారు. రాష్ట్ర సాధనకోసం 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర బంగారు భవిత కోసం ఎందరో త్యాగం చేశారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రమూ పడనంతగా దగాపడిన రాష్ట్రం మనదేనన్నారు. బయటివారి కత్తి గాట్లు, సొంత వారి వెన్నుపోట్లతో రాష్ట్రం తల్లడిల్లిందని ఆవేదన వెలిబుచ్చారు.
రాష్ట్రంలో నేటికీ 33 శాతం చదువు రానివారు ఉన్నారని, దాదాపు 85 శాతం ప్రజలు తెల్ల రేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారని సీఎం తెలిపారు. 32 లక్షల మంది నిరుపేదలు ఆవాసం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 90 లక్షల మంది అక్కాచెల్లెల్లు స్వావలంబన కోసం సమరం చేస్తున్నారని, కోటి ఎకరాల్లో ఒక పంటకు కూడా నీటి సదుపాయం లేకుండా ఉన్నాయని వివరించారు. పిల్లల చదువులు, వైద్యం కోసం గతంలో ఆస్తులు అమ్మకునే పరిస్ధితులు ఉండేవని, ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవలకు వారు నోచుకోని పరిస్ధితి ఉండేదన్నారు. గ్రామ గ్రామాన ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన కర్తవ్యాన్ని ఈ సమస్యలు గుర్తు చేస్తున్నాయన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటి పారుదల రంగాలపై వాస్తవిక దృక్పధంతో దృష్టి పెట్టామని వెల్లడించారు.