ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై ఏపీ సీఎం వైఎస్.జగన్ సమీక్షించారు. జగనన్న విద్యాకానుక, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పైనా చర్చించారు. విద్యాసంస్థల అభివృద్ధి కమిటీలు, అధికారులకు శిక్షణా కరదీపికను ఆవిష్కరించారు. మొదటిదశ నాడు-నేడులో పనులు పూరైన పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారికి సులువుగా అర్థమయ్యేలా పూర్తిచేసిన నాడు-నేడు పనుల పరిశీలనపై ప్రశ్నావళి పంపాలని ఆదేశించారు.
ప్రజలకు అంకితం
నాడు-నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేశామని, ఇప్పుడు పాఠశాలలను సరిగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఏప్రిల్ 30న తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అధికారులు పాఠశాలలకు వెళ్లినప్పుడు పాఠశాల సహా మరుగుదొడ్ల నిర్వహణపై తనిఖీలు చేయాలన్నారు. రెండోదశ కింద చేపట్టాల్సిన నాడు-నేడు పనులు, హాస్టళ్లలో నాడు-నేడు కింద చేపట్టనున్న పనులు, మరుగుదొడ్ల నిర్వహణపైనా సీఎం సమీక్షించారు.
విద్యాకానుకలో జాప్యం వద్దు
జగనన్న విద్యాకానుకపై సమీక్షించిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యేనాటికి కచ్చితంగా పిల్లలకు విద్యాకానుక అందాలని జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. విద్యాకానుక కింద అందించే డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సీబీఎస్‌ఈ విధానంపై సీఎం సమీక్షించారు. 2021–22 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్ చేయాలన్నారు. 2024-25లో రాష్ట్ర విద్యార్థులు సీబీఎస్‌ఈ టెన్త్‌బోర్డు పరీక్షలు రాయనున్నట్లు సీఎం తెలిపారు. సీబీఎస్‌ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు.