కరోనా నివారణ, సహాయ చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వలసకూలీల తరలింపుపై సీఎం చర్చించారు. విదేశాలు, పలు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది వచ్చే అవకాశముందని అధికారులు సీఎంకు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారంతా విశాఖ, విజయవాడ, తిరుపతి వస్తారన్న అధికారులు.. వచ్చిన వారందరికీ అక్కడే వైద్యపరీక్షలు చేయిస్తామని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని చెప్పారు.
వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇక్కడున్న ఇతర రాష్ట్రాల కూలీలకు ఆహారం, వసతి కల్పించాలన్నారు. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తామనే వారికి సహకరించాలన్నారు. తమ రాష్ట్రాలకు వెళ్తామనే వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.