కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగునీరు, నాడు- నేడు, హౌసింగ్, ఉపాధి హామీ, కరోనా నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమీక్షించారు.
కరోనా పరీక్షల సంఖ్యలో దేశంలో ఏపీదే మొదటి స్థానమన్న సీఎం... ప్రతి పదిలక్షల జనాభాకు రికార్డు స్థాయిలో 2,500కు పైగా టెస్టులు చేశామన్నారు. కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేశామన్నారు. కరోనాతో కలిసి జీవించాలన్నది వాస్తవమైన విషయమని మరోసారి స్పష్టంచేశారు. దగ్గడమో, తుమ్మడమో చేస్తే.. అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందన్నారు. కరోనా మరణాల రేటు 2 శాతం లోపే ఉందని సీఎం జగన్ తెలిపారు.
వైరస్ వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు అడుగులు వేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి లక్షకు మందికి పైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని అంచనాలు చెబుతున్నాయని జగన్ తెలిపారు. లక్షల మంది ఇతరులు కూడా ఉంటారన్నారు. వివిధ దేశాల నుంచి కూడా రాష్ట్రానికి చెందిన వారిని ఆయా దేశాలు పంపుతున్నాయని చెప్పారు.
ప్రతి గ్రామంలో 10 మందికైనా సరిపడే క్వారంటైన్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆయా కేంద్రాల్లో బెడ్లు, బెడ్షీట్లు, దిండ్లు, టాయిలెట్లు, భోజనం అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు జరగాలని చెప్పారు.