ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి రారని, ఒకవేళ వచ్చినప్పటికీ జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుతో ఓబీసీ డైరెక్టర్‌గా ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన న్యాయవాది సీబీఐ కోర్టుకు నివేదించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో రెండో నిందితుడైన వి.విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్, అభియోగాల నమోదుపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది యు.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కేవలం పబ్లిక్ సర్వెంట్‌గా చూపడానికే సీబీఐ అదనపు అభియోగపత్రం దాఖలు చేసిందన్నారు. ఆయన ఆ పరిధిలోకే రారని పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డికి జగతి పబ్లికేషన్స్ కేసుతో సంబంధమేంటి? - AP CM jagan latest news
జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుతో ఓబీసీ డైరెక్టర్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది సీబీఐ కోర్టుకు నివేదించారు.
ఓబీసీ డైరెక్టర్‌గా ఈ కేసుతో సంబంధం గురించి సీబీఐ ఎక్కడా పేర్కొనలేదని, ఆ హోదాలో నేరానికి ఎక్కడ పాల్పడ్డారన్నదీ చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకవేళ అభియోగపత్రం దాఖలు చేసేనాటికి ఆయన డైరెక్టర్‌గా ఉన్నట్లయితే అనుమతి కోసం అభియోగపత్రాన్ని ఓబీసీకి పంపాల్సి వచ్చేదన్నారు. అలా పంపితే ఓబీసీ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని బ్యాంకే తేల్చిచెప్పి ఉండేదని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను నేటికి వాయిదా వేశారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని వాన్‌పిక్, రాంకీ కేసుల విచారణ డిసెంబరు 2కు వాయిదాపడింది.