భావితరాల కోసమే 3 రాజధానులు: జగన్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. విజయవాడలో జరిగిన... 'ది హిందూ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరావతి ఎప్పటికీ శాసన రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్య నిర్వాహక రాజధానిగా విశాఖ నగరానికి అన్ని అర్హతలున్నాయన్న ఆయన.... అందుకే అక్కడ పరిపాలనా యంత్రాంగం ఉండబోతోందని తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకునే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తద్వారా రాయలసీమ ప్రాంతానికి కూడా తగిన న్యాయం జరుగుతుందని వివరించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకపోతే వచ్చే తరాలకు అన్యాయం, నష్టం జరుగుతుందని జగన్ అన్నారు.
అంత ఖర్చు చేయలేం
రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలంటేనే గత ప్రభుత్వ నివేదికల ప్రకారం ఒక్కో ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు. ఆ లెక్కన 53 వేల ఎకరాలకు మొత్తం రూ.1.09 లక్షల కోట్లు అవుతాయన్నారు. కానీ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో కేవలం రూ.5,677 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు.
విశాఖ నెంబర్ 1
ఏపీలో విశాఖ నెంబర్ 1 నగరం అని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని జగన్ తెలిపారు. అమరావతిలో ఖర్చు చేయాల్సిన లక్ష కోట్లలో కనీసం 10వ వంతు ఖర్చు విశాఖలో చేస్తే, వచ్చే 10 ఏళ్లలో ఆ నగరం హైదరాబాద్‌తో పోటీ పడుతుందని అన్నారు. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాదని వెల్లడించారు.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాథ్యమం సహా నాడు- నేడు, మధ్యాహ్న భోజనం, అమ్మఒడి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయమై ముందుకే వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నామని, అదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేశామని చెప్పారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా, ప్రైవేటు స్కూళ్లలో కూడా తెలుగు ఒక సబ్జెక్ట్‌గా ఉండాలని నిర్దేశిస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబానికి తండ్రి పెద్ద అయితే, రాష్ట్రానికి సీఎం తండ్రి వంటి వాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓ తండ్రిగా పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చేర్పిస్తానని అన్నారు. పేద కుటుంబాల పిల్లలు ఎందుకు ఆంగ్ల మాధ్యమంలో చదవకూడదని ప్రశ్నించారు. మంచి విద్య వల్లనే నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, దారిద్య్రం పోతుందని చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా.. 13 జిల్లాలలో తొలుత 20 మంది చొప్పున మొత్తం 260 మందికి శిక్షణ ఇవ్వబోతున్నామని వివరించారు.
2 వేల కోట్లు ఆదా
రివర్స్ టెండరింగ్ విప్లవాత్మక నిర్ణయమని సీఎం సమర్థించుకున్నారు. ఇప్పటివరకు 2వేల కోట్లు ఆదా చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్న ముఖ్యమంత్రి.. గోదావరి జలాలు వృథా కాకుండా కృష్ణాతో అనుసంధానం చేయనున్నట్టు వివరించారు.
ఇదీ చదవండి:
'రాజధానిపై రెఫరెండం పెట్టండి.. ఓడితే ఇక మాట్లాడను'