ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సహా.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 8 మందితో కలిసి దిల్లీకి వెళ్లారు. అంతకుముందు.. కడప వెళ్లిన ఆయన పులివెందులలో తన మామ ఈసీ గంగిరెడ్డి.. సంస్మరణ సభలో పాల్గొన్నారు. గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి.... నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి... సంస్మరణ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి గన్నవరం చేరుకుని దిల్లీ వెళ్లారు.
దిల్లీకి ఏపీ సీఎం జగన్.. రేపు అపెక్స్ కౌన్సిల్‌కు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధానితో రాష్ట్రాభివృద్ధి అంశాలు, తాజా పరిస్థితులపై చర్చించనున్నట్టు సమాచారం. దిల్లీ నుంచే రేపు అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ భేటీలో జగన్ పాల్గొననున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఆర్థిక సహకారం అందించాలని మంగళవారం ఉదయం ప్రధానికి వినతి పత్రం అందించనున్నట్లు సమాచారం. ఎన్డీఏలో వైకాపా చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య జగన్ దిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశం జరగనుంది. ఆ భేటీలో పాల్గొని రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై తన వాదన వినిపించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:తెలంగాణ వాదనలను దీటుగా తిప్పికొడదాం : ఏసీ సీఎం జగన్