Cm Jagan Comments in Modi Meeting: ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల జనసంద్రాన్ని తలపిస్తోందన్నారు. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర జనం.. ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చిందని వెల్లడించారు. విజయనగరం వాసి మహాకవి గురజాడ మాటలు కర్తవ్య బోధ చేస్తున్నాయని తెలిపారు. ఇవాళ దాదాపు రూ.10 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యావాదాలు తెలిపారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో తమ ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని పేర్కొన్నారు.
"విశాఖలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల జనసంద్రాన్ని తలపిస్తోంది. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతూ కనిపిస్తోంది. ఏపీకి మరిన్ని సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరుతున్నా. విభజన గాయాల నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునఃనిర్మాణానికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం. మాకు.. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు"- సీఎం జగన్