Plastic Flexies Ban: ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీసేందుకు పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు నాణేలన్న ఆయన... విశాఖలో పార్లె ఫర్ ది ఓషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. తీరంలో వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆ సంస్థ పని చేస్తోందన్నారు. ఈ ఒప్పందంతో దాదాపు రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాబోయే ఆరేళ్లలో వస్తాయని వివరించారు. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. 2027నాటికి ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ రాష్ట్రంగా తయారవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధించామని.. దీంతో అక్కడ సత్ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. తిరుమల స్ఫూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. మానవ వనరులను అభివృద్ధి చేస్తూ.. వచ్చే తరాలకు చక్కని పర్యావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పర్యావరణం, ఆర్థికాభివృద్ధిని సమానంగా చూస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త సేకరణ బాగా జరుగుతోందన్నారు.
"రాష్ట్రంలో నేటినుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నాం. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధించాం. ప్లాస్టిక్ నిషేధంతో తిరుమలలో సత్ఫలితాలు వస్తున్నాయి. తిరుమల స్ఫూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. 2027 నాటికి ప్లాస్టిక్, పొల్యూషన్ రహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలి."- సీఎం జగన్