Jagan React on Pawan Comments: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా? అని ధ్వజమెత్తారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వ్యవస్థను చూసి భయమేస్తోందని వ్యాఖ్యానించారు. చేసింది చెప్పుకోలేక బూతులు తిడుతున్నారని విమర్శించారు. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని జగన్ అన్నారు. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని... నాయకులుగా చెప్పుకొంటున్న వాళ్లు ఇలా మాట్లాడితే మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూడేసి, నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోమని చెబితే వ్యవస్థ ఏం బతుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డలో సీఎం జగన్ పర్యటించారు. 22 ఏ(1) కింద ఉన్న నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపారు. రైతులకు నిషేధిత భూముల జాబితా నుంచి డీనోటిఫై భూముల క్లియరెన్స్ పత్రాలు జారీ చేశారు. అవనిగడ్డ-కోడూరు రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కృష్టా కుడి, ఎడమ కరకట్ట, సముద్ర కరకట్ట పటిష్ఠానికి రూ.25 కోట్లు కేటాయిస్తామన్నారు.