తెలంగాణ

telangana

ETV Bharat / state

'సురభి నాగేశ్వరరావు మరణం యావత్ నాటక రంగానికి తీరని లోటు' - కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత

CM Condolences to Nageshwara rao: కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటుడు, పద్మశ్రీ సురభి నాగేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శతాబ్దానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సీఎం కొనియాడారు.

CM Condolences to Nageswara rao
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటుడు, పద్మశ్రీ సురభి నాగేశ్వర రావు

By

Published : Jun 9, 2022, 10:17 PM IST

CM Condolences to Nageshwara rao: సంగీత, నాటకరంగానికి శతాబ్దానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటుడు, పద్మశ్రీ సురభి నాగేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడిగా, నాటక రంగానికి నాగేశ్వర రావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదని అన్నారు. నాగేశ్వర రావు మరణం సురభి సంస్థకే కాకుండా, యావత్తు నాటక రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శేరిలింగంపల్లిలోని అయన నివాసంలో సాయంత్రం ఐదున్నర గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు.

నాలుగో ఏటనే రంగస్థల ప్రవేశం: దేశ విదేశాల్లో సురభి నాటకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రాణం పోసిన బాబ్జీని 2013లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 125 ఏళ్ల సురభి నాటక సమాజానికి పద్మశ్రీ తెచ్చిన ఘనత నాలుగో తరానికి చెందిన బాబ్జిదే. 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ, బళ్లారి రాఘవ, ఎన్టీఆర్ పురస్కారాలు వరించాయి. ఏపీలోని విజయ నగరం జిల్లా గజపతినగరంలో జన్మించిన బాబ్జి తన నాలుగో ఏటా రంగస్థల ప్రవేశం చేశారు.

సురభి ప్రస్థానమిదే: ఆనాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్, పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు లాంటి హేమాహేమీలతో ప్రశంసలు అందుకున్న మేటి కళాకారుడు, అంతకు మించి గొప్ప ఆర్గనైజర్ బాబ్జీ. బాబ్జి అసలు పేరు రేకందర్ నాగేశ్వర రావు. అందరికి సురభి బాబ్జిగా సుపరిచితులు. శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి బాధ్యతలు చేపట్టి గత నాలుగు దశాబ్దాలుగా 35 కుటుంబాలను చల్లగా చూసుకున్న మహనీయుడు. పిల్లలు లేని లోటును ఆ ఐదు సమాజాలకు చెందిన 70 మంది కళాకారులను తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. గరిమెళ్ల రామ్మూర్తి, మొదలి నాగభూషణ శర్మ, బీవీ కారంత్​ల సాన్నిహిత్యం ఆయన్ని గొప్ప కార్య నిర్వాహకుడిగా మార్చింది. డాక్టర్ కేవీ రమణాచారి, డాక్టర్ అర్జా శ్రీకాంత్ లాంటి అధికారుల అండదండలతో లలిత కళాతోరణంలో 15 ఏళ్ల పాటు శాశ్వత థియేటర్ ఏర్పాటు చేసుకుని టికెట్ డ్రామాలు కొనసాగించారు. ఫ్రాన్స్​లో ప్రత్యేక సురభి ప్రదర్శనలు ఇచ్చారు. కరోనా సమయంలో సైతం అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లోని తెలుగు వారి కోసం నాటకాలు ప్రదర్శించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేలా చేసిన చరిత్ర బాబ్జిదే.

సురభి సంస్థల్లో బాబ్జి మాదిరిగా కార్య నిర్వహణాదక్షుడు మరొకరు లేరు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో జన్మించిన బాబ్జి తన నాలుగో ఏటలో రంగస్థల ప్రవేశం చేశారు. పెద్దయ్యాక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వీర బ్రహ్మేంద్ర స్వామి, నక్షత్రకుడు, బాల నాగమ్మలో కార్యవర్ధి పాత్రలు పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారు. సురభి నాటక సమాజం ఆద్యులు వనారస గోవిందరావు కుమార్తె సుభద్ర కుమారుడు బాబ్జి. పద్మశ్రీ బీవీ కారంత్ శిష్యరికంతో అయన ఆలోచనలు మరింత మారిపోయాయి. సురభి సంప్రదాయాన్ని పోనివ్వకుండా మరింత ఆకర్షణీయ ప్రయోగాలతో కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పైచేయి సాధించారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కొనసాగిన ఐదు సురభి సంస్థలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. 125 ఏళ్ల సురభి చరిత్రను కాపాడుకున్న బాబ్జి లేకున్నా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఇవీ చదవండి:

మహిళల భద్రతపై సర్కార్​ ఫోకస్​.. హైదరాబాద్​లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

మహారాష్ట్ర, దిల్లీలో కరోనా పంజా.. ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!

ABOUT THE AUTHOR

...view details