తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీజీ.. తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరుస్తున్నారు..' - mla jaggareddy latest news

భాజపా కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్​ నేతలు పలు డిమాండ్​లు లేవనెత్తారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాయగా.. సికింద్రాబాద్​ అల్లర్ల కేసులో అరెస్ట్​ అయిన యువతపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, అగ్నిపథ్​ను రద్దు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్​ చేశారు.

మోదీ లక్ష్యం: హామీలు అమలు చేయాలన్న భట్టి.. 'అగ్నిపథ్'​ రద్దు చేయాలన్న జగ్గారెడ్డి
మోదీ లక్ష్యం: హామీలు అమలు చేయాలన్న భట్టి.. 'అగ్నిపథ్'​ రద్దు చేయాలన్న జగ్గారెడ్డి

By

Published : Jul 1, 2022, 8:14 PM IST

తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం-2014లోని హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించి.. 8 సంవత్సరాలవుతున్నా.. అందులోని హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 8 ఏళ్ల కాలంలో మోదీ పలుమార్లు హైదరాబాద్ వచ్చినా.. ఏ ఒక్క సభలోనూ విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావించలేదని గుర్తు చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని భట్టి ఆరోపించారు. తల్లిని చంపి, పిల్లను బతికించారంటూ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు.. తెలంగాణ ఏర్పాటు పట్ల ప్రధానికి ఉన్న వ్యతిరేకతను తెలుపుతున్నాయని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తక్షణమే అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తన లేఖలో కోరారు.

కాంగ్రెస్‌ను చంపడం ఎవరి తరం కాదు:మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందంటూ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీని చంపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పాటు సామాజిక న్యాయం, సామాజిక సంస్కరణలు కోరుకునేది కాంగ్రెస్‌ పార్టీనేనన్నారు. వ్యక్తిగత ఎజెండా కోసమే కొండా భాజపాలో చేరుతున్నారని.. ఆ పార్టీలో చేరడం ద్వారా కొండా ఫ్యూడల్ లక్షణాలు బయటపడ్డాయని ఆక్షేపించారు. 2023లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రకటన చేయకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం..: ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ అల్లర్ల కేసులో అరెస్టయిన యువతపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా, అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసేలా రాష్ట్రానికి వస్తున్న మోదీని భాజపా నేతలు ఒప్పించాలని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్​ చేశారు. 'అగ్నిపథ్'ను రద్దు చేయాలని సోనియా, రాహుల్ గాంధీలు ఇచ్చిన పిలుపు మేరకు భాజపా రేపు ప్రకటన చేయకపోతే కాంగ్రెస్‌ పార్టీ తమ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details