Bhatti Vikramarka on Electoral reforms bill: కేంద్రం ఓటరు కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఎన్నికల చట్టాల సవరణ బిల్లు తీసుకురావడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యతిరేకించారు. ఈ ఎన్నికల చట్టాల సవరణ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేట్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేట్లు ఓటర్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడానికే లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ-2021 బిల్లును కేంద్రం ఏకపక్షంగా తెచ్చి ఆమోదింప చేసుకుందని ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని విమర్శించారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళనల మధ్య న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లు ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదించడం, కేంద్రం అనుసరించిన వైఖరి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు.
ఆధార్ అనేది చిరునామా కోసం మాత్రమే..
ఆధార్ కార్డు చిరునామా కోసం మాత్రమే వినియోగించేదని, దేశంలో తమకు పౌరసత్వం ఉన్నట్లుగా నిర్ధారించాడానికి జారీ చేసే గుర్తింపు కార్డు కాదని భట్టి పేర్కొన్నారు. ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తే ఓటర్‌కు చెందిన వివరాలు బహిర్గతం అవుతాయని ఐటీ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ బిల్లులో న్యాయపరమైన అనేక లోపాలు ఉన్నాయని, బిల్లు పరిశీలనకు స్థాయీ సంఘానికి పంపించాల్సి ఉన్నా... అది చేయలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సభాపక్ష నేత, ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా వినిపించుకోకుండా... మోదీ సర్కార్ పౌరుల వ్యక్తిగత, సమాచార భద్రత హక్కును ఈ బిల్లు ఆమోదం ద్వారా లాక్కుందని మండిపడ్డారు. ఓటర్ ఐడీ కార్డుతో అనుసంధానం కాని వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.