తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రమంతటా కాంగ్రెస్​ గాలి - 75 నుంచి 78 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటు పక్కా : భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వివాదం

CLP Leader Bhatti Vikramarka Interview : రాష్ట్రంలో పోలింగ్‌ సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మరింత పెరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో 70కి పైగా స్థానాల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. అభివృద్ధి పేరిట రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం మినహా బీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో అర్హులైన నాయకులు చాలా మంది ఉండటంతోనే సీఎం పదవి కోసం పోటీ ఉందని భట్టి స్పష్టం చేశారు.

Congress Leader Bhatti Vikramarka Interview
Congress Leader Bhatti Vikramarka

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 9:23 AM IST

CLP Leader Bhatti Vikramarka Interview : రాష్ట్రంలో కాంగ్రెస్‌(Telangana Congress) ప్రభంజనం రాబోతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారని.. రాష్ట్రం అప్పుల పాలైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ తెచ్చిన విద్యుత్ ప్రాజెక్టులతోనే బీఆర్ఎస్ సర్కారు కరెంటు అందిస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలోనే కాంగ్రెస్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని.. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడెందుకు మొసలి కన్నీరు కారుస్తోందని భట్టి ప్రశ్నించారు.

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అవసరం :ఎన్నికలప్రచారంలో కాంగ్రెస్‌అప్రతిహతంగా దూసుకెళ్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నెలరోజుల క్రితమే 75-78 స్థానాలు వస్తాయని అంచనా వేశామన్నారు. తాజా పరిస్థితుల్లో మరో 10 స్థానాలు పెరిగేలా ఉన్నాయని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, బలహీన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కాలని వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రజల తెలంగాణ సాధనకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అవసరమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఆత్మగౌరవం, అహంకారానికి మధ్య పోటీ :రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికలూ భావోద్వేగాల మధ్య జరిగాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు పూర్తిగా మరుగునపడిపోయాయని ఆరోపించారు. ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద లూటీ అయ్యిందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం అంటే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌గా బీఆర్ఎస్ చెబుతోందని విమర్శించారు. అప్పట్లో కాంగ్రెస్‌ అమల్లోకి తెచ్చిన రూ.2 లక్షల బంగారుతల్లి చట్టాన్ని పక్కనపెట్టి రూ.లక్ష మాత్రమే ఇస్తోందని మండిపడ్డారు. ఇప్పటికన్నా సమైక్య రాష్ట్రంలోనే ఎక్కువ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో పాలకులకు మాత్రమే సంపద దక్కిందని చెప్పారు. అందుకే ప్రజల ఆత్మగౌరవానికి, పాలకుల అహంకారానికి మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక - ప్రచార కాక

ఉచిత విద్యుత్తు పేటెంట్‌ కాంగ్రెస్‌దే..:కాంగ్రెస్‌ వస్తే కరెంటు ఉండదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR), కేటీఆర్‌, హరీశ్‌రావులు.. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతోనే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ వెలుగులున్నాయని తెలుసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. జైపూర్‌, ఎన్టీపీసీ, శ్రీశైలం హైడల్‌ ప్రాజెక్టు, సాగర్‌ ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్‌ తీసుకొచ్చినవని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ కేవలం రెండు ప్రాజెక్టులే చేపట్టిందని తెలిపారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో ఇంతవరకు ఉత్పత్తి జరగలేదని ఆరోపించారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ను కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో చేపట్టడంతో ట్రయల్‌ రన్‌లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హమీనిచ్చారు. ఉచిత కరెంటు పేటెంట్‌ ముమ్మాటికీ కాంగ్రెస్‌దేనని భట్టి స్పష్టం చేశారు.

Bhatti Vikramarka on Telangana Congress CM Candidate Issue : కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలంతా సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పదేపదే తమ సీఎం కేసీఆర్‌ అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలి తప్పితే నియంతలా ప్రకటించుకోవడం తగదని ఆరోపించారు. కాంగ్రెస్‌లో సీఎం పదవికి అర్హతలున్న నాయకులు అనేక మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇది పార్టీకి పెద్ద ఆస్తి అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి అవకాశం వచ్చినా కాంగ్రెస్‌ భావజాలంతోనే ముందుకెళ్తారని తెలిపారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తాం - ప్రజాపాలన అందిస్తాం : భట్టి విక్రమార్క

అభివృద్ధి, సంక్షేమానికే మా ప్రాధాన్యం :అభివృద్ధికి అర్థం బీఆర్ఎస్​కు తెలియదని భట్టి విక్రమార్క ఆరోపించారు. అభివృద్ధి పేరిట రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో కుంగిన పియర్స్‌ను తొలగించి మళ్లీ నిర్మించాలని డ్యామ్‌ సేఫ్టీ అధికారులే(Dam Safety Officers) చెబుతున్నారని చెప్పారు. ఇదీ బీఆర్ఎస్ అభివృద్ధికి నిదర్శనని వ్యాఖ్యానించారు. మిషన్‌ భగీరథ(Mission Bhagiratha) పేరిట రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినా.. అనేక గ్రామాలకు తాగునీరు అందటం లేదని విరుచుకుపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేస్తూనే సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాలకు అందించాలని పేర్కొన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచాలని తెలిపారు. రాబోయే తమ ప్రభుత్వం ఇదే విధానం అవలంబిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Bhatti Vikramarka Comments on BJP Government :తెలంగాణలో 2 శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీ.. బీసీని సీఎం చేస్తామని ప్రకటించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి ప్రభుత్వం రాదు కాబట్టే కల్లబొల్లి మాటలు చెబుతోందని వ్యాఖ్యానించారు. 'వారి రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు..? కాంగ్రెస్‌తో పాటు మిగిలిన అన్ని పార్టీలు బీసీ కులగణన చేపట్టాలని కోరుతున్నా కేంద్రం ఎందుకు చేయడం లేదు..? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం' అని భట్టి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఎందుకు వర్గీకరించలేదని నిలదీశారు. పదేళ్ల నుంచి బీజేపీనే అధికారంలో ఉంది కదా అని ప్రశ్నించారు. వారిని ఎవరు ఆపారో సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క కోరారు.

కర్ణాటకలో అమలు చేస్తున్నాం..:కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అనూహ్య స్పందన వస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. వీటితో బతుకులు మారుతాయని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రకటించిన అన్ని హామీలనుకాంగ్రెస్‌ అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్టలని ఆయన ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పథకాలు అమలవడం లేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అక్కడకు తీసుకెళ్లి గ్యారంటీ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూపిస్తామంటే ముందుకు రావడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.

ప్రచారంలో జోరు పెంచిన ప్రతిపక్షాలు - ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటామంటూ ఓటర్లకు అభ్యర్థన

ధరణి స్థానంలో 'భూమాత'.. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్​నెట్‌ - రేపే కాంగ్రెస్​ మేనిఫెస్టో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details