హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు కలిసిపోయాయన్నది అవాస్తవమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హుజురాబాద్‌లో ఓడిపోతామనే భయంతో ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు భిన్న ధృవాలు ఎలా కలుస్తాయన్న ఆయన.. కేటీఆర్ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెరాస, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఈటలపై విచారణ ఎటుపోయిందని ప్రశ్నించిన భట్టి... ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితంగా కొట్టిపారేశారు. కేటీఆర్ రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెరాసకు పట్టడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూడలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని భట్టి పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళితబంధును ఆపడంలో భాజపా, తెరాస పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. దళితబంధుపై భాజపా వైఖరి సరిగా లేదని భట్టి విమర్శించారు. హైదరాబాద్ నిండా తెరాస ఫ్లెక్సీలు నింపారన్న భట్టి... ప్రతిపక్షాల ఫ్లెక్సీలు పెడితే హడావుడి చేసే అధికారులు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.