తెరాస ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినా హామీలను తెరాస నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో బతుకుదామనుకుంటే.. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మర్యాద కూడా ప్రజలు పొందలేకపోతున్నారని తెలిపారు.
Bhatti: తెరాస ఏడేళ్ల పాలన ప్రజలను నిరాశకు గురిచేసింది: భట్టి - తెరాసపై భట్టి విమర్శలు
రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా తెరాస సర్కారు హామీలు అమలు చేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పాలకులు అందుకోలేకపోయారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ చెప్పిన ప్రకారం లక్షా 91 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయడం లేదని.. డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూదందాల్లో మాత్రమే విజయం సాధించారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసిన చరిత్ర తెరాసదేనని ఆరోపించారు. ప్రచార ఆర్భాటం తప్పితే... అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ... పోలీసులను అడ్డుపెట్టుకుని అరెస్టులు చేస్తోందన్నారు. ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రజలను చైతన్యం చేయడమే తప్ప చేసేదేమీ లేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.