తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని మారోమారు స్పష్టం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). కృష్ణా, గోదావరి రెండు నదులపై రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. కేసీఆర్ (Kcr) చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదని మండిపడ్డారు.
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం (Sangameshwaram) వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నాలు చేసినట్లు భట్టి అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 11 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు తరలిపోతాయని ముందే చెప్పినట్లు వివరించారు. సంగమేశ్వరం ప్రాజెక్టు నిండితే కానీ శ్రీశైలం నిండదు. అప్పుడు నాగార్జున సాగర్‌కు నీళ్లు రావని పేర్కొన్నారు.