తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదాయం భారీగా వస్తున్నా.. ఆర్థిక స్థితి అస్తవ్యస్తం: భట్టి - clp leader bhatti comments on finance

Bhatti on state income: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఆదాయం భారీగా వస్తోందని చెబుతున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపంచారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని... బిల్లులు రాక తెరాస సర్పంచులే ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.

Bhatti on state income
భట్టి

By

Published : Jun 6, 2022, 10:57 PM IST

Bhatti on state income: వాస్తవాలకు దూరంగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులను రూ.5 లక్షల కోట్లకు తీసుకెళ్తారని విమర్శించారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్‌, మద్యం ధరలను విపరీతంగా పెంచేశారని.. ప్రభుత్వం అన్ని వస్తువులపై ధరలు పెంచుతున్నా ప్రజలు భరిస్తున్నారని వాపోయారు. ఆదాయం భారీగా వస్తున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, పొరుగు సేవలు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారని భట్టి మండిపడ్డారు. పాఠశాలల స్వీపర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆందోళనలో ఉన్నారని ధ్వజమెత్తారు. బిల్లులు రాక తెరాస సర్పంచులే రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారన్నారు. గ్రామ సర్పంచులు తమ బిల్లుల కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతలను పరామర్శించిన భట్టి..:రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర రాజధానిలో మైనర్‌ బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తాజాగా మరో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు వార్తలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపిన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అరెస్టైన షాహినాయత్ గంజ్​ పోలీస్​స్టేషన్​లో​ ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మహిళ కాంగ్రెస్ నాయకులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తదితరులు పరామర్శించారు. అత్యాచారం జరిగిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమని విమర్శించారు.

ఇవీ చదవండి:'తెలంగాణ ప్రస్తావన లేకుండా పారిశ్రామిక సమావేశాలు జరగడం లేదు'

కంట్రోల్ తప్పిన హెలికాప్టర్, విమానం.. లక్కీగా వందల మంది..

ABOUT THE AUTHOR

...view details