రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అంతా అయోమయంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. వరదల వల్ల హైదరాబాద్ మునిగిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. సన్నవడ్ల కొనుగోలు, నిరుద్యోగ భృతి, దళితులకు భూమి, రెండు పడక గదుల ఇళ్లు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అయోమయంగా ఉంది : భట్టి - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్రంలో ప్రభుత్వపాలన అయోమయంగా ఉందని.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తెరాస సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులపై భట్టి విమర్శలు గుప్పించారు. సీఎం, మంత్రులు సెక్రటేరియట్‌కు రారన్న భట్టి విక్రమార్క.. సమస్యలను ప్రస్తావించాలంటే ఏ ప్రభుత్వ శాఖ ఫోన్లు పనిచేయటం లేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని, సంగమేశ్వరం నుంచి ఏపీ నీటిని దోపిడీ చేస్తున్నా.. సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ద్వారా.. రెవెన్యూ వ్యవస్థలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. వరద సహాయం ఏమైందని.. ఎన్నికల తర్వాత ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశం పరిశీలిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు పరిశీలన చేసిందో లేదో తెలియదని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు మినహా మిగతా మంత్రులకు అధికారాలు లేవని.. మిగిలిన వారంతా డమ్మీలేనని విమర్శించారు.
ఇదీ చూడండి:'డీపీఆర్‌లు ఎందుకివ్వరు?.. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు'