తెలంగాణ

telangana

ETV Bharat / state

నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు.. కేజ్రీవాల్‌పై భట్టి ఫైర్ - కేజ్రీవాల్‌పై భట్టి ఆరోపణలు

Bhatti Vikramarka Comments on Kejriwal : దేశంలో ఓ మార్పు కోసం ప్రజలంతా నమ్మి ఓట్లేసిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ వారి నమ్మకాన్ని వొమ్ము చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కేజ్రీవాల్.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావన వచ్చిన కేజ్రీవాల్, కవితతో పాటు మిగతా వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka

By

Published : Feb 3, 2023, 1:47 PM IST

Bhatti Vikramarka Comments on Kejriwal : దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రస్తావన రావడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన కేజ్రీవాల్‌, కవితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవినీతిని అంతమొందిస్తానన్న మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కేజ్రీవాల్.. నమ్మిన వారందరికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

Delhi Liquor scam case : "అవినీతికి వ్యతిరేకంగా సమాజ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఈ దేశంలో ఉన్న యువతీయువకులు ఓ మార్పును కోరుకుని కేజ్రీవాల్‌కు ఓట్లేసి గెలిపించారు. కానీ ఆయన అవినీతిలో మునిగితేలుతున్నారు. ఇంతకంటే ప్రమాదకరమైనది ఏదీ ఉండదు. ప్రజల నమ్మకాన్ని ఆయన వొమ్ము చేశారు. యువతకు ఉన్న భరోసాను ఆయన దూరం చేశారు. అలాంటి నాయకుడు సమాజానికి ప్రమాదకరం. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగమైన వారందరిపై చర్యలు తీసుకోవాలి." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

అసలేం జరిగిందంటే..? : దిల్లీ మద్యం కుంభకోణం అనుబంధ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రస్తావించింది. దిల్లీ, పంజాబ్ ఎన్నికల ప్రచారం నిధుల కోసమే.. ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. హోల్ సేల్ వ్యాపార సంస్థలకు 12 శాతం మార్జిన్‌ ఇచ్చి అందులో 6శాతం ముడుపుల రూపంలో వెనక్కి తీసుకొనేలా... మద్యం విధానాన్ని రూపొందించినట్లు తెలిపింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే మద్యం విధానం రూపకల్పన మొదలైందని ఈడీ ఆరోపించింది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.

మరోవైపు ఈ ఛార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. కవితతో సమీర్ మహుంద్రు వీడియోకాల్ మాట్లాడటంతో పాటు.. హైదరాబాద్‌లో కలిశారని ఛార్జిషీట్‌లో వివరించింది. కవిత ఆదేశాల మేరకు కోటి రూపాయలను... అరుణ్ పిళ్లైకి ఇచ్చినట్లు ఆమె అనుచరుడు శ్రీనివాసరావు వాంగ్మూలమిచ్చారని పేర్కొంది. మద్యం వ్యాపారంపై కవిత ఆప్ లీడర్లతో చర్చించారని.. సౌత్‌గ్రూపు ద్వారా వంద కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదిరిందని... అరుణ్ పిళ్లై చెప్పినట్లు వెల్లడించింది.

దిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన చర్చల్లో కవిత పాల్గొన్నట్లు ఈడీ తెలిపింది. ఇండోస్పిరిట్​కు వచ్చిన లాభాల్లో కోటి 70 లక్షలు... మాగుంట గౌతమ్ తీసుకున్నట్లు పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వివిధ పేర్లతో ఆరు రిటైల్ జోన్లను దక్కించుకున్నట్లు తెలిపింది. కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని వివరించింది.

ABOUT THE AUTHOR

...view details