BHATTI: రాష్ట్రంలో వరద నష్టంను అంచనా వేయటంలోనూ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు. గత ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేవని భట్టి గుర్తు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి రెండు మూడు రోజులు భద్రాచలంలో సీఎల్పీ బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కడెం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నట్లు భట్టి తెలిపారు. కాళేశ్వరం ముంపు, సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటించి జరిగిన నష్టంపై పోరాడుతుందన్నారు. స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్‌పైనే కక్ష్యకట్టారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు తాళం వేశారని మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు ప్రతి జిల్లాలో.. 75కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని సీఎల్పీ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో అందరూ పాల్గొనాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.