ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్(Eamcet counselling news) సీట్లను నవంబరు 24న అధికారులు కేటాయించారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ముగిసింది. మొత్తం 57,177 మందికి బీటెక్, 223 మందికి బీఫార్మసీ సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 26లోపు ఫీజు చెల్లించి, స్వయంగా కళాశాలలో రిపోర్ట్ చేస్తేనే సీటు ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు. టీసీ మాత్రమే అసలు ధ్రువపత్రం(ఒరిజనల్) ఇవ్వాలని, మిగిలినవి ఫొటోస్టాట్ కాపీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు.. సీట్లు పొందిన వారిలో రెండు, మూడు వేలమంది కళాశాలల్లో చేరకపోవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్వీనర్ కోటాలో మొత్తం 79,856 సీట్లుండగా.. ఇంకా 22,679 మిగిలిపోయాయి. సీఎస్‌ఈలో 19,101 సీట్లుంటే 1505 మాత్రమే మిగిలాయి. ఈసీఈలో 74.48 శాతం నిండాయి. మెకానికల్ బ్రాంచీల్లో 5,902 సీట్లుంటే 1663 మాత్రమే(28.18) భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.31 శాతం, ఈఈఈలో 41.88 శాతం సీట్లు నిండాయి. త్వరలో స్లైడింగ్‌తో పాటు స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. స్లైడింగ్‌లో విద్యార్థులు అదే కళాశాలలో ఖాళీలుంటే ఇతర బ్రాంచీలకు మారిపోవచ్చు. అలా మారితే వారికి బోధనా రుసుం వర్తించదు.
లాసెట్(Lawcet Counseling news), పీజీఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలయ్యాయి. లాసెట్ కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. ఎడ్‌సెట్ కౌన్సెలింగ్(EDCET Counseling news)లో భాగంగా డిసెంబరు 1 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలిస్తారు.