రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత నిజమని నిరూపిస్తున్నారు ఆ మామ కోడలు. ఇదెక్కడో కాదు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం చినమేరంగి కోటలో. ఇద్దరూ ఒకే కుటుంబం, ఒకే పార్టీలో ఉంటూ ఇలా రచ్చకెక్కడం ఇప్పుడు ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్ జట్టులో ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రిగా పుష్పశ్రీవాణి కొనసాగుతున్నారు. ఇంత గొప్ప పదవిలో ఉండి... సొంత పార్టీదే అధికారమైనా కురుపాం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదని.. మంత్రి పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల రాజు చెప్పడం చర్చనీయాంశమైంది. మాజీ శాసనసభ్యులు, వైకాపా నాయకుడైన ఆయన... వైకాపా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించడం వల్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని తెలిపారు.
కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కనిపించడం లేదని వాపోయారు. పింఛన్ల పంపిణీలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. పూర్ణపాడు-లాజేమ వంతెన నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్థం కావడం లేదని.. రేగిడి గెడ్డ జలాశయం అనుసంధాన కార్యక్రమం కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగావళి నది ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం కాలగర్భంలో కలిసిపోయిందన్న శత్రుచర్లరాజు.. జియ్యమ్మవలస మండలం చందు నుంచి అప్పుల భద్ర, పరసపాడుతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.