తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపాలక ఎన్నికలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం - హైకోర్టు విచారణ

పురపాలక ఎన్నికల పిటిషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ జరపనుంది. ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​పై ధర్మాసనం విచారించనుంది.

పురపాలక ఎన్నికల పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ

By

Published : Aug 13, 2019, 6:13 AM IST

Updated : Aug 13, 2019, 7:23 AM IST

పురపాలక ఎన్నికల విషయమై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల పిటిషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ జరపనుంది. ఓటరు జాబితా తయారీ, వార్డుల పునర్విభజనలో తప్పులు దొర్లాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా ధర్మాసనం ఎన్నికల నిర్వహణపై పలుచోట్ల స్టే విధించింది. పురపాలక ఎన్నికలపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది. వీటన్నింటి నేపథ్యంలో పురపోరుపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టులో ఈనెల 9న కౌంటర్ దాఖలు చేసిన సర్కారు... రాష్ట్రంలో పదవీకాలం పూర్తైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపింది. తప్పులు దొర్లిన చోట సరిదిద్దామని... ఎలాంటి ఇబ్బందులూ లేవని స్పష్టం చేసింది. ఎన్నికల కసరత్తు పూర్తైందని... ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని తెలిపింది.

ఇవాళ విచారణ..

ఎన్నికల నిర్వహణకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గతంలోనే పేర్కొంది. పురపాలక ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎన్నికల నిర్వహణ విషయమై ఇవాళ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం నుంచి ఆదేశాలు వస్తే... ప్రభుత్వం వార్డుల వారీ, మేయర్లు, ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లను ప్రకటించనుంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

పురపాలక ఎన్నికల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ఇవీ చూడండి : '50 అడుగులకు చేరనున్న గోదావరి నీటిమట్టం'

Last Updated : Aug 13, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details