CJI AT AIMC: దేశ, విదేశాలకు చెందినవారు ఆర్బిట్రేషన్ కోసం ఇక నుంచి హైదరాబాద్ ఐఏఎంసీ వైపు చూస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల(ఏడీఆర్) ధోరణి పెరగడానికి ఈ కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు. అంతర్జాతీయ కేంద్రాలకు దీటుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం(ఐఏఎంసీ) శనివారం ఘనంగా ప్రారంభమైంది. నానక్‌రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్స్‌లోని 21, 22 అంతస్తులలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని కేంద్రమంతా కలియ తిరుగుతూ వసతులను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐఏఎంసీ కార్యాలయానికి సంబంధించిన పత్రాలను సీఎం సీజేఐకి అందజేశారు. కేంద్రం వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐఏఎంసీ సీఈవో సితేష్ ముఖర్జీ, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, రెండు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, ఇతరులు పాల్గొన్నారు. ఐఏఎంసీ ప్రారంభం అనంతరం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశ, విదేశ పార్టీలు విదేశీ కేంద్రాలైన సింగపూర్, లండన్ల వైపు చూస్తున్నాయి.. ఇకపై హైదరాబాద్ కేంద్రం మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. ఆర్బిట్రేషన్, మీడియేషన్ విషయంలో దేశం, ఆసియాతోపాటు ప్రపంచానికి ఈ కేంద్రం బాటలు వేయగలదు. హైదరాబాద్ ఐఏఎంసీ సింగపూర్ కేంద్రం కంటే మెరుగైనది.
ఇంతకంటే గొప్ప ప్రాంతం లేదు
ఇది నా నగరం. దీనిపట్ల పక్షపాతం చూపుతున్నానని నిందించవచ్చు. నిజాయతీగా చెప్పాలంటే హైదరాబాద్‌కు ఒకరు అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరంలేదు. దేశంలోని గొప్ప నగరాల్లో ఇదొకటి. ఈ నగర శోభకు నా వంతు సాయం చేసినందుకు గర్వపడుతున్నా. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధిగా ఉన్న హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి. ఇక్కడ భిన్న సంస్కృతులు, భాషలవారున్నారు. ముఖ్యంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారు. ఐఏఎంసీని ఏర్పాటు చేయడానికి ఇంతకంటే గొప్ప ప్రాంతం లేదు
-సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
మధ్యవర్తిత్వం కొత్తదేమీ కాదు..
CJI NV Ramana on ICADR: 26 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దిల్లీలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రాన్ని(ఐసీఏడీఆర్) ప్రారంభిస్తూ ప్రజాస్వామ్యంలో తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా వివాదం పరిష్కారం కావాలని అన్నారు. లేకుంటే ప్రజలు చట్టాలను చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య రంగాలు సజావుగా సాగడానికి సమర్థమైన వివాద పరిష్కార మార్గం అవసరమని అప్పట్లోనే ఆయన నొక్కిచెప్పారు. ఆర్థిక సరళీకరణలో భాగంగా దేశ, అంతర్జాతీయ స్థాయిలో సాధ్యమైనంత అనుకూలంగా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వివాదాలను పరిష్కారించాల్సిన అవసరం వచ్చింది. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ చట్టం-1996 ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతిని అందిస్తోందని ఆశిస్తున్నా. అయినా ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం కొత్తవేమీ కావు. నచ్చిన వ్యక్తుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునే విధానం గతంలోనూ ఉన్నదే.
అనతి కాలంలోనే కల సాకారం
CJI on kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనతి కాలంలోనే కల సాకారమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక జూన్ 12న హైదరాబాద్‌కు వచ్చినపుడు సీఎంతో చర్చించా. ఆగస్టునాటికి ఎంవోయూ, ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తికావడం, 4 నెలల్లోపే ప్రయత్నాలన్నీ వాస్తవ రూపం దాల్చడం మన కళ్లతో చూస్తున్నాం. ఇక్కడ తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యాలు, సానుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపార, వాణిజ్య వివాదాలతోపాటు కుటుంబ వివాదాలకూ ఈ కేంద్రంలో పరిష్కారం లభిస్తుంది.