విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ (CJI justice nv ramana news) అన్నారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్నాతకోత్సవంలో సీజేఐ చేతుల మీదుగా విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.
ఈనాటి నా పదవులు, గౌరవానికి ఆయన ఆశీస్సులే కారణం..
పతకాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు. విద్యార్థి దశలో కీలక దశ ముగించుకుని తర్వాతి దశకు వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి. నిస్వార్థ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరం. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి ఈ వర్సిటీ ప్రతీక. ఆధునిక గురుకులాలకు ఇది ఆదర్శ నమూనా. సత్యసాయి ప్రవచించిన ప్రేమను సమాజానికి, పర్యావరణానికి, భూమాతకు మనం అందించాలి. ఈనాటి నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణం. సత్యసాయి మాతృప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఎక్కడికెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవసరముంది.