తెలంగాణ

telangana

ETV Bharat / state

HIGH COURT: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరుగుదల! - telangana latest news

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 75 శాతం పెరగనుంది. రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచుతూ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల నుంచి న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని చేస్తున్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీజేఐ... న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య  24 నుంచి 42కి పెరుగుదల!
హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరుగుదల!

By

Published : Jun 10, 2021, 4:28 AM IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి 42కి పెరిగింది. పెండింగ్‌ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని 2019 ఫిబ్రవరి 13న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపారు. పరిశీలన తర్వాత న్యాయశాఖ దాన్ని అప్పట్లో పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యమంత్రి నుంచి లేఖ, ప్రధానమంత్రి కార్యాలయం చేసిన సూచనలను అనుసరించి మరోసారి పరిశీలించింది. సంఖ్య పెంచడం కంటే ముందు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అదే ఏడాది నవంబరు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది.

తెలంగాణ పరిస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావించిన సీజేఐ..
జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వివిధ హైకోర్టుల ప్రతిపాదనలను సమీక్షించారు. ఆ విషయాలను ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందులో న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై తెలంగాణ హైకోర్టు పంపిన ప్రతిపాదనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతనెల 27న మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. ‘‘తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అంశం 2019 నుంచి పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జడ్జిల పోస్టులను పూర్తిగా భర్తీ చేసినప్పటికీ అక్కడున్న పెండింగ్‌ కేసుల పరిష్కారానికి సరిపోరు. పెండింగ్‌ కేసుల సంఖ్య 2.46 లక్షలకు చేరింది. మొత్తం 2.10 లక్షల సివిల్‌, 36 వేల క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదన ప్రకారం అక్కడ 42 మంది న్యాయమూర్తులు కూర్చొనేందుకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా ఖర్చు చేయాల్సిందేమీ లేదు. హైకోర్టు చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు’’ అని వివరించారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ కార్యాచరణలోకి దిగి న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెంచడానికి అనుమతి ఇచ్చింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేసింది. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ మంగళవారం ఆమోదముద్ర వేశారు. పెరిగిన సంఖ్య ఆరోజు నుంచే అమల్లోకి వచ్చినట్లైందని అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులను ఏ క్షణమైనా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.

ఏపీ హైకోర్టును మించి..

తాజా పెంపుతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఏపీ హైకోర్టును మించనుంది. ఏపీ హైకోర్టుకు 37 పోస్టులుండగా, తెలంగాణ హైకోర్టుకు 5 అదనంగా వచ్చాయి. అలహాబాద్‌లో అత్యధికంగా 160 న్యాయమూర్తుల పోస్టులున్నాయి. బాంబే హైకోర్టులో 94, పంజాబ్‌, హరియాణాలో 85, మద్రాస్‌లో 75, కోల్‌కతాలో 72, కర్ణాటకలో 62, దిల్లీలో 60, మధ్యప్రదేశ్‌లో 53, పట్నాలో 53, గుజరాత్‌లో 52, రాజస్థాన్‌లో 50, కేరళ హైకోర్టులో 47 పోస్టులు ఉన్నాయి. తాజా పెంపుతో కేరళ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. మొత్తం 25 హైకోర్టుల్లో సంఖ్యా పరంగా తెలంగాణ 13వ స్థానానికి చేరింది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61 ఉండగా, విభజన తర్వాత అందులో 37 ఏపీకి, 24 తెలంగాణకు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కానుంది.

ఇదీ చూడండి: కరోనా తగ్గిపోయాక చికిత్స గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details