న్యాయవ్యవస్థలో సాంకేతికత అంతర్భాగమైందని.. సాంకేతిక పరిజ్ఞానం వాడకం వేగంగా పెరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని.. కాజ వద్ద నిర్మించిన జ్యుడీషియల్ అకాడమీ భవనాన్ని.. ఆయన ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీలో హైకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. కార్యక్రమంలో పాల్గొని హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
ఆన్‌లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, న్యూట్రల్ సైటేషన్ ప్రారంభించారు. ఏపీ హైకోర్టు మొదటి వార్షిక నివేదికను సీజేఐ విడుదల చేశారు. ఈ-సర్టిఫైడ్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతోపాటు .. ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
సాంకేతికత అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. నూతన సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమైన ప్రక్రియ అని.. న్యాయవ్యవస్థ వేగంగా సేవలందించాలంటే మౌలిక వసతులు మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుందని వివరించారు.