Paddy Procurement Arrangements Started in TS : రాష్ట్రంలో యాసంగి మార్కెటింగ్ సీజన్‌పై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభం కావడంతో.. తగిన ఏర్పాట్ల పై పౌర సరఫరాల శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది. రైతుల సౌకర్యార్థం క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియో ట్యాగింగ్, రవాణా, రైస్ మిల్లుల అనుసంధానం, గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర అన్ని రకాల వనరులు సిద్ధంచేసుకునే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
ఇటీవల కురిసి అకాల వర్షాలు, వడగండ్ల వానల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని రైతులు కోతలు మొదలుపెట్టారు. ధాన్యం నూర్పిడి, బస్తాల్లో నింపుతూ అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. యాసంగి మార్కెటింగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ మూడో వారం నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 21వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు అందాయి.
ఈ సన్నాహాల్లో భాగంగా ఏప్రిల్ 10న హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఉన్న పౌరసరఫరాల భవన్‌లో మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు భేటీ కానున్నారు. ఈ యాసంగి సీజన్‌లో 55 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మళ్లీ అకాల వర్షాలు సంభవించే సూచనలు ఉన్న నేపథ్యంలో.. గ్రామాల్లో అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, జియో ట్యాగింగ్, తేమ మిషన్లు వంటి ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు.