రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానిది మధ్యవర్తిత్వం అంటున్న భాజపా నేతలపై పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. మిల్లర్లతో కుమ్ముక్కయ్యారంటూ చేస్తున్న వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ ఎఫ్‌సీఐ నుంచి ఖరీఫ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్లు రావాల్సి ఉందని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. తాజా యాసంగిలో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లల్లో రికార్డు సృష్టించినట్లైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో 6,301 కోనుగోలు కేంద్రాల ద్వారా 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం ఓ రికార్డు అని ప్రకటించారు. 6 లక్షలా 30 వేల మంది రైతుల నుంచి రూ.6,724 కోట్ల విలువైన ధాన్యం సేకరించడమే కాకుండా నగదు చెల్లింపుల కోసం సోమవారం రూ.615 కోట్లు, ఇవాళ రూ.286 కోట్లు విడుదల చేశామన్నారు.