రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బ తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి(Civil Supplies Chainman Mareddy Srinivasa Reddy) రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతేడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం మిలర్లకు అప్పగించినట్లు ఆయన వివరించారు.
భారత ఆహార సంస్థ (FCI) నుంచి ఎదురవుతున్న ప్రతిబంధకాలతో బియ్యం అప్పగించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇందువల్ల మిల్లుల్లోనే 70శాతం ధాన్యం నిల్వలు ఉన్నాయని వివరించారు. యాసంగి సీజన్ కస్టమ్ మిల్లింగ్ రైస్-సీఎంఆర్ సేకరణ, ఎఫ్‌సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై ఇవాళ పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి రైసు మిల్లర్లతో ఆయన సమీక్షించారు. గోదాంలను లీజుకు తీసుకునే విషయంలో ఎఫ్‌సీఐ కొత్త నిబంధనలతో సమస్యలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని వివరించారు.