Civil Services in Grama Panchayat: పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) అధ్యయనం మేరకు స్పష్టమైన గడువులోగా పౌరసేవలు అందించేందుకు పౌరసేవా పట్టిక అమలు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సూచించింది. పంచాయతీల్లో 48 రకాల పౌరసేవల అమలుకు సంబంధించి గడువు పేర్కొంటూ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. పారిశుద్ధ్యం, వీధిదీపాల మరమ్మతులు, వివాహ నమోదు, తాగు నీటి సమస్యలు తదితర పల్లెప్రగతి పనులకు సకాలంలో చర్యలు తీసుకుంటున్నా కీలకమైన పౌరసేవల్లో జాప్యం జరుగుతోంది.
గడువు దాటినా...
Grama Panchayat Office: పంచాయతీల్లో ఇంటి నిర్మాణ అనుమతి, ఆస్తిపన్ను మదింపు, ఆస్తి బదలాయింపు సేవలు 15 రోజుల్లోగా పరిష్కరించాలని నిబంధనలున్నా ఇప్పటివరకు పంచాయతీలకు అందిన దరఖాస్తుల్లో అధికం గడువు ముగిసిన తర్వాతే పరిష్కారమవుతున్నాయి. గ్రామాల్లో లేఅవుట్లకు 44 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొనగా 2,300 దరఖాస్తుల్లో 324 అర్జీలకే సకాలంలో అనుమతులు దక్కాయి. ఇప్పటికీ 1,665 పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తిపన్ను మదింపు కోసం 4,220 దరఖాస్తులు వస్తే 2,389 మాత్రమే పరిష్కారమయ్యాయి. మరో 1,003 పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామాల్లో వ్యాపార అనుమతులు వారం రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉండగా వీటికీ ఆలస్యమవుతోంది. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం 90వేల దరఖాస్తులు రాగా 56 వేల అర్జీలపైనే సకాలంలో నిర్ణయం తీసుకున్నారు.