హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకొకసారి జరిగే వైమానిక ప్రదర్శన ఈసారి ప్రముఖులెవరూ లేకుండానే ప్రారంభమైంది. తొలిరోజు కంపెనీల భవిష్యత్తు, విమానయాన ప్రణాళికలు, భారత్‌లో తమ కార్యకలాపాల గురించి పలు సంస్థలు వివరించాయి. 20కు పైగా రాష్ట్రాలు, వందకు పైగా స్టాల్ నిర్వాహకులు, 15 వందల మంది విదేశీ ప్రతినిధులు హాజరు కావాల్సి ఉన్నా.... 500 మంది ప్రతినిధులే వచ్చారు. కరోనా ప్రభావంతో గతంలో కంటే ఈసారి ప్రతినిధుల సందడి బాగా తగ్గింది. అదరహో అనిపించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలు తూతూమంత్రంగానే జరిగాయి.
వింగ్స్ ఇండియా ప్రదర్శన: విహంగాలు లేవు... వీక్షకులు లేరు
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్.... అట్టహాసంగా జరగాల్సిన వైమానిక ప్రదర్శనను వదల్లేదు. పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో.... హైదరాబాద్లో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 'వింగ్స్ ఇండియా - 2020' ప్రదర్శన ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనకు.. తొలిరోజు పట్టుమని 10విమానాలు రాలేదు.
విదేశీ కంపెనీల హెలిక్యాప్టర్లు, జెట్ ప్లేన్స్, ఇతిహాద్, బోయింగ్, ఎయిర్ బస్ , ఎమిరేట్స్‌కు చెందిన భారీ విమానాలు మొదటి రోజు దర్శనమివ్వలేదు. దుబాయ్ నుంచి వస్తున్న వారిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటున్నందున ఎమిరేట్స్ కి చెందిన ఖతర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ బస్-380ని ప్రదర్శనలో ఉంచడంలేదు. ఏవియేషన్‌కు సంబంధించిన విడిభాగాలు, సాంకేతికత అంశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎక్స్పో శుక్రవారం ప్రారంభించనున్నారు. ఏవియేషన్ షో సందర్భంగా సారంగ్, జెఫ్రీ టీం లు నిర్వహించిన గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కరోనా ఎఫెక్ట్..
ఇప్పటికే ప్రపంచ దేశాలను కరోనా గజగజ వణికిస్తున్నందున.... విదేశీ సంస్థలు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనకడుగు వేశాయి. హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసు నమోదవడం... దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నందున వైమానిక ప్రదర్శనకు స్పందన కరువైంది. ప్రతిసారీ చివరిరోజు సాధారణ సందర్శకులను అనుమతించే నిర్వాహకులు.... ఈసారి రద్దు చేశారు.