కరోనాతో సరదాలు.. షికార్లు దూరమయ్యాయి. కొద్దిసేపు ఉపశమనం పొందేందుకు మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇటువంటి సమయంలోనే నగర ప్రజలు ప్రకృతి ఆస్వాదనకు మొగ్గుచూపుతున్నారు. స్వచ్ఛమైన గాలి.. మట్టివాసనలను ఈతరం పిల్లలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయక్షేత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. పూలు, పండ్లమొక్కలు.. ఆకట్టుకునే పరిసరాలు.. కొండకోనల్లో స్వచ్ఛంగా పారే సెలయేళ్ల మధ్య ఇంటిల్లిపాదీ సేదతీరుతున్నారు. తమ బిడ్డలకు మట్టిలోని గొప్పతనాన్ని.. వ్యవసాయంలోని హుందాతనాన్ని పరిచయం చేయటం ద్వారా తల్లిదండ్రులు గొప్ప అనుభూతికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యావంతులు పచ్చదనాన్ని పరిచయం చేయడాన్నే వృత్తిగా మలచుకుంటున్నారు. అటువంటి వ్యవసాయక్షేత్రమే.. కమ్యూనిటీ సపోర్ట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (సీఎస్‌ఏ).
వంద ఎకరాల్లో వ్యవసాయ దర్శనం
షాద్‌నగర్ సమీపంలోని భీమారంలో 250 మంది రైతులు కలిసి వంద ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయంతో సామూహిక సాగుకు శ్రీకారం చుట్టారు. వీరు చేస్తున్న ప్రయోగాలు.. అనుసరిస్తున్న సాగు పద్ధతులతో వ్యవసాయంవైపు కొత్తతరం మొగ్గుచూపుతోంది. ఎంతోమంది రైతులకు ఇప్పుడిది శిక్షణ కేంద్రంగా మారింది. ఇలాంటి క్షేత్రాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటంతో సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో సేదతీరామనే అనుభూతి కలిగించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేకంగా అంశాలకు రూపకల్పన చేశారు.