తనదైన నటనతో ఇటీవల సినిమాల్లో వరసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న జీవన్‌కుమార్.... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యారు. ఇటీవల బంపర్‌హిట్ అయిన జాతిరత్నాలతోపాటు... విరాటపర్వం, పుష్ప చిత్రాల్లో జీవన్ నటిస్తున్నారు. రెస్టారెంట్ వ్యాపారంలో అనుభవమున్న జీవన్.. గతేడాది లాక్‌డౌన్ వేళ వేలాది మంది నిరుపేదలకు తన చార్‌కోల్ రెస్టారెంట్ నుంచి ఆహారం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ జీవన్ తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లోని గర్భిణీలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కరోనా రోగులకు భరోసా కల్పిస్తున్నారు.
ప్రత్యేక సంస్థ ఏర్పాటు
తన పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేసిన జీవన్.. ముగ్గురు స్నేహితుల సహకారంతో ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేశారు. మెయిల్‌తోపాటు వాట్సాప్‌కు వచ్చే అభ్యర్థనల ఆధారంగా ఆహారాన్ని తయారు చేసి... సకాలంలో సరఫరా చేస్తున్నారు. శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని కరోనా బాధితులకు ఉచితంగా రెండు పూటలా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల వద్ద రోగుల బంధువులకు ఆహారం అందజేస్తున్నారు. ఇలా రోజుకు 300 మందికిపైగా ఉచితంగా భోజనం పంపుతూ... విపత్తు వేళ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. లింగంపల్లి వద్ద ఓ నిరుపేద గర్భిణీ అనుభవించిన వేదన తనను తీవ్రంగా కలిచివేసిందని... ఆ ఘటనతోనే తాను సంపాదించే ప్రతి పైసా తోటివారి ఆరోగ్యం కోసం ఖర్చుపెడుతున్నట్లు జీవన్‌కుమార్ చెబుతున్నారు.