CII Telangana Annual Conference: రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భారత బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయలో జరుగుతున్న భారతీయ పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశం జరిగింది. ఈ వార్షిక సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత్ బయెటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దీనిలో ప్రభుత్వం కృషి ఎంతో ఉందని చెప్పారు. వీటితో పాటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు కూడా చాలా బాగున్నాయని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం.. తనకు చాలా నచ్చిందని మెచ్చుకున్నారు.
యువతలో దాగిన ఉన్న ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన టీహబ్ ఒక మంచి ఆలోచన అని కీర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. పెద్ద ఎత్తున హరితహారం పేరుతో మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సుచిత్ర ఎల్లా వ్యాఖ్యానించారు. పునరుత్పాదక శక్తి రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో ఏ మూలల విదేశీ కంపెనీలు పెట్టాలన్నా దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉండడం శుభసూచికమే అని హర్షం వ్యక్తం చేశారు.