రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు Christmas Day celebrations in Telangana: ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి తెలంగాణలో అధికారికంగా క్రిస్మస్ పండుగను నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పురస్కరించుకుని జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌తో కలిసి పాల్గొన్నారు. ఏసు క్రీస్తు సూక్తులు ఆచరణీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభువు ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షించిన మంత్రి.. ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని కొనియాడారు. సమాజంలో శాంతి సహనాలతో ప్రజలంతా జీవించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. అన్ని మతాల పట్ల ఆదరణ.. సర్వ మతాలను సమానంగా చూసే గుణం కేసీఆర్‌కే సొంతమని వెల్లడించారు.
మెదక్ సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున క్రైస్తవులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. మనిషి సమృద్ధిగా జీవించడానికి ఏసుక్రీస్తు మార్గంలో నడవాలని ఆయన సందేశాన్ని అందించారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని 114 ఏళ్ల చరిత్ర గల చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలో మెదక్ చర్చి తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన చర్చిగా ప్రసిద్ధికెక్కిందని నిర్వాహకులు వెల్లడించారు. పండగను పురస్కరించుకొని ప్రార్థనలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్, వెస్లీ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ మతపెద్దలు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. క్రీస్తు జననానికి సంబంధించిన వృత్తాంతాన్ని తెలుపుతూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభు ఆశీస్సులతో ప్రపంచం సుఖ శాంతులతో ఉండాలని మతపెద్దలు ఆకాంక్షించారు.
జగిత్యాలలోని మిషన్ కాంపౌండ్ సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పర్వదినం సందర్భంగా గీతాలాపన.. ప్రార్థనలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని క్రిస్మస్ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజ పాల్గొన్నారు. హనుమకొండలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాజీపేటలోని ఫాతిమా చర్చిలో పిల్లాపాపలతో తరలివచ్చి ప్రార్థనలు చేశారు. పరకాల సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. మత గురువు ఏసు ప్రభును కీర్తిస్తూ పాటలు పాడారు. నిజామాబాద్‌లోని సీఎస్ఐ చర్చిలోనూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొని కేక్ కట్ చేశారు.
ఇవీ చదవండి: