Christmas Celebrations 2021: రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి జోరందుకుంది. ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలను విద్యుత్ కాంతులతో సిద్ధం చేస్తున్నారు. గృహాలను ప్రత్యేకంగా అలంకరించుకునేందుకు ధగధగమెరిసే క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లాజ్ బొమ్మలను క్రైస్తవ సోదరులు ఎక్కవగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు పలు రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు సరికొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
బట్టల పంపిణీ..
హైదరాబాద్ రాజ్ భవన్‌లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొని రాజ్ భవన్ సిబ్బందికి, వారి పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వీట్లు, కానుకలు అందజేశారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని గవర్నర్ ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ అన్నారు. హనుమకొండలోని బాపిస్ట్ చర్చిలో క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేద క్రైస్తవ సోదరులకు బట్టలను పంపిణీ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.