తెలంగాణ

telangana

ETV Bharat / state

christmas celebration in telangana: రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబురాలు - తెలంగాణ వార్తలు

christmas celebration in telangana: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా చర్చిలన్నింటిని అందంగా ముస్తాబు చేశారు. అర్ధరాత్రి నుంచే పెద్దఎత్తున చర్చిలకు చేరుకుంటున్న క్రిస్టియన్లు... ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక గీతలు ఆలపిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్‌ దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలతో వేడుకలు జరుపుకుంటున్నారు.

christmas celebration in telangana, merry christmas  2021
రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబురాలు

By

Published : Dec 25, 2021, 11:58 AM IST

Updated : Dec 25, 2021, 3:11 PM IST

christmas celebration in telangana: రాష్ట్రంలో క్రిస్మస్‌ వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. క్రిస్టియన్లందరికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్నిచాటిన ఏసుక్రీస్తు బోధనలు... ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన పేర్కొన్నారు. సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని సీఎం కోరారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా... క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల కాంతుల విద్యుద్ధీపాలతో చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. బోయిన్‌పల్లి, రసూప్‌పుర, మారేడ్‌పల్లి ప్రాంతాల్లోని క్రిస్టియన్లకు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కానుకలు అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబురాలు

మెదక్​ చర్చిలో ఘనంగా వేడుకలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్​ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నుల పండువగా జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావటంతో.... చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి... కొవ్వత్తులు వెలిగిస్తూ మొక్కులు తీసుకున్నారు. అనంతరం... చర్చి ప్రాంగణంలోని పశువుల పాకను దర్శించుకుని.... గురువుల దీవెనలు అందుకున్నారు. వేడుకల సందర్భంగా చర్చి వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేడుకల్లో మంత్రి హరీశ్

దక్షిణ భారతదేశంలోని మెథడిస్ట్ చర్చిల్లో అతిపెద్దదిగా పేరొందిన జహీరాబాద్ మెథొడిస్ట్ చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ చర్చిలో క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిద్దిపేటలోని సీఎస్​ఐ చర్చిలో క్రైస్తవ మతపెద్దలు ఏసు క్రీస్తును కీర్తిస్తూ ఆరాధన మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.... చర్చిలో కేక్‌ కట్‌ చేసి... క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, పలువురికి పండుగ కానుకలను అందజేశారు. ఏసు ప్రభువు చెప్పిన సూక్తులను చదవటమే కాకుండా... అందరూ ఆచరించాలని మంత్రి సూచించారు..

ఏసుక్రీస్తు సూచించిన సూక్తులు అందరికీ ఒక్కటే. అందరినీ ప్రేమించండి. శ్రమాగుణం కలిగిఉండాలి. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో... పనులను కూడా అంతే ప్రేమించమని ఏసుప్రభు అందరికీ చెప్పారు. వాటిని బైబిల్​లో చదవడమే కాదు.. నిత్యజీవితంలో ఆచరింపజేయాలి. అందరికీ పండుగ శుభాకాంక్షలు.

-హరీశ్ రావు, మంత్రి

చర్చిల్లో రద్దీ

ఖమ్మంలో తెల్లవారుజాము నుంచి చర్చిల వద్ద సందడి నెలకొంది. విద్యుత్‌ దీపాలు, నక్షత్రాలతో ప్రార్థనామందిరాలను అలంకరించారు. ఏసుక్రీస్తు రాక.. ఆయన బోధనలను సంఘకాపారులు వాక్యోపదేశం చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రిస్మస్‌ గీతాలు ఆకట్టుకున్నాయి. నగరంలోని చర్చికాంపౌండ్ సీఎస్​ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ , మేయర్‌ నీరజ పాల్గొన్నారు.

అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. కరోనాను అంతం చేయడం కోసం ఏసుక్రీస్తు దయ ఉండాలని ప్రార్థనలు చేశాం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా. క్రైస్తవ సోదరసోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు.

-పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రి

ప్రత్యేక ప్రార్థనలు

హనుమకొండలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. కాజీపేట.. ఫాతీమా కథిడ్రల్ చర్చిలో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ఏసు ఆగమనాన్ని కీర్తిస్తూ పాటలు పాడుతున్నారు. ప్రజలను సన్మార్గంలో నడిపేందుకు క్రీస్తు జన్మించారని... అందరూ అదే బాటలో నడవాలని మతపెద్దలు సూచించారు.

ఇదీ చదవండి:దేశంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Last Updated : Dec 25, 2021, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details