తెలంగాణ

telangana

ETV Bharat / state

చేతులెత్తే విధానంలో ఛైర్ పర్సన్ల ఎంపిక? - telangana muncipal elections news

రాష్ట్రంలో మేయర్లు, ఛైర్ పర్సన్లను చేతులెత్తే విధానంలో ఎన్నుకోనున్నారు. పురపాలక ఎన్నికలు ముగిశాక పాలకమండళ్ల మొదటి ప్రత్యేక సమావేశంలోనే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక చేపట్టాల్సి ఉంటుంది. పార్టీల తరఫున ఎన్నికైన అభ్యర్థులందరికీ మేయర్, ఛైర్​పర్సన్ ఎన్నిక సందర్భంగా విప్ వర్తిస్తుంది. విప్ ఉల్లంఘించిన వారు పదవి కోల్పోవాల్సి ఉంటుంది.

Choice of Chairpersons in Hands Up Process in telangana
చేతులెత్తే విధానంలో ఛైర్ పర్సన్ల ఎంపిక?

By

Published : Jan 19, 2020, 5:00 AM IST

Updated : Jan 19, 2020, 7:16 AM IST

పురపాలక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో ఈ నెల 22న, కరీంనగర్ కార్పొరేషన్​లో 24న పోలింగ్ జరగనుంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తై ఫలితాలు ప్రకటించాక మేయర్లు, ఛైర్​పర్సన్ల ఎన్నిక ఉంటుంది. ఏ రోజు ఎన్నిక ఉంటుదనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది.

సభ్యుల కోరం ఉంటేనే
మేయర్లు, ఛైర్​పర్సన్ల ఎన్నిక కోసం పురపాలక చట్టంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీ నోటిఫికేషన్​కు అనుగుణంగా జిల్లా కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారి మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక కోసం పాలకమండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ముందురోజు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సమావేశం రోజు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయ్యాక ఎన్నిక చేపడతారు. కనీసం సగం మంది ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల కోరం ఉంటేనే మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

సమానంగా ఓట్లు వస్తే..
అధ్యక్షుల ఎన్నిక కోసం ఒక సభ్యుడి పేరును ప్రతిపాదిస్తే మరో సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. అభ్యర్థి సంబంధిత పార్టీ నుంచి ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారికి ఉదయం 10 గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. పోటీలో ఒకరు మాత్రమే ఉంటే ఏకగ్రీవం. ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు పోటీలో ఉంటే సమావేశంలో సభ్యులు చేతులేత్తి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని మేయర్ ఛైర్ పర్సన్​గా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన విజేతను ఎంపిక చేస్తారు.

ఎన్నిక పూర్తయ్యాకే డిప్యూటీ
మేయర్, ఛైర్​పర్సన్ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. రాజకీయ పార్టీ తరఫున ఒక సభ్యుణ్ని విప్​గా నియమించుకోవచ్చు. పార్టీ ఇచ్చిన విప్​ను ధిక్కరించే వారు వారి సభ్యత్వాన్ని కోల్పోతారు. మేయర్, ఛైర్‌ పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకే డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్​పర్సన్ ఎన్నిక చేపట్టాల్సి ఉంటుంది. మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీల ఎన్నిక నిర్వహించకూడదు. నోటీసు ఇచ్చిన రోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు మళ్లీ నిర్వహించవచ్చు. వరుసగా రెండు రోజులు ఎన్నిక జరగకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఆ ఎన్నిక కోసం ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ జారీచేస్తుంది.

చేతులెత్తే విధానంలో ఛైర్ పర్సన్ల ఎంపిక?

ఇదీ చూడండి : కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

Last Updated : Jan 19, 2020, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details