రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. 40రోజులవుతున్నా ఇంతవరకు చిక్కలేదు. దాడిలో తాజాగా ఓ లేగదూడ మృతి చెందింది. మండలంలో చిరుత ఇప్పటివరకు 10 లేగదూడలను హతమార్చింది. కడ్తాల్ మండలంలో 40 రోజులుగా చిరుత సంచారం స్థానికులను నిద్రపోనివ్వడం లేదు. రాత్రి పూట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
కడ్తాల్లో 40 రోజులైనా చిక్కని చిరుతపులి - రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం... దాడిలో లేగదూడ మృతి
రంగారెడ్డి జిల్లాలో 40 రోజులుగా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా భయాందోళనలో ప్రజలు కాలం గడుపుతున్నారు. తాజాగా చిరుత దాడిలో ఓ లేగదూడ మృతి చెందింది. అటవీ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు ఆందోళనకు దిగారు.
అటవీశాఖ అధికారులు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేసినా ఇంత వరకు చిరుత చిక్కకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని గ్రామస్థులు అంటున్నారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో కాకుండా వేరేచోట్ల బోనులు పెట్టారని సిబ్బంది తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు రెండు లేదా మూడ చిరుతలు సంచరిస్తున్నట్లు కూడా గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
వీలైనంత తొందరగా.. చిరుతను పట్టుకొని సమస్య పరిష్కరించాలని కడ్తాల్ మండల వాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: చెట్టెక్కిన ఎలుగుబంటి... భయాందోళనలో ప్రజలు