Children Parliament Prime Minister Story Hyderabad: జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు.. ఒక్కొక్కరిది ఒక్కో గాధ.. పరిస్థితులను తిట్టుకుంటూ బతుకు బండిని భారంగా లాగించేవారు కొందరైతే.. వాటిని ఎదుర్కోలేక తనువు చాలించేవారు మరికొందరు. ఎదురించి పోరాడి విజయం సాధించేవారు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన అరిపిన జయలక్ష్మి.. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్కి వలస వచ్చారు. మొదట్లో ముగ్గులు అమ్ముతూ జీవనం సాగించేవారు. తర్వాత ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడాన్ని ఉపాధిగా ఎంచుకున్నారు. తల్లి, తండ్రీ చెరో బండి తీసుకుని చెత్త సేకరించేవారు.
Children Parliament PM Jaya Lakshmi :చిన్నప్పటి నుంచి కుటుంబ కష్టాలు వారి పేదరికం గురించి అవగాహన చేసుకున్న జయలక్ష్మి(Jayalakshmi).. 7వ తరగతి నుంచి తల్లిదండ్రులకు పనిలో సాయం చేసేది. ఆమె దినచర్య ఇతర పిల్లలకు భిన్నంగా ఉండేది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి 8 గంటల వరకు తల్లితో పని చేసిన తర్వాత కళాశాలకు వెళ్లేది. సాయంత్రం సమయంలో వారి బస్తీలోని ఒక ఖాళీ ప్రదేశంలో పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న జయలక్ష్మీ ఇప్పటికీ చెత్త తీయడంలో సాయం చేస్తూ చదువుకుంటోంది.
పేదరికాన్ని జయించడానికి చదువు ఒక్కటే మార్గమని ఆ యువతి బలంగా నమ్మింది. చిన్న వయసు నుంచి నలుగురిలో కలవడం, చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కార మార్గాలు ఆలోచించడం జయలక్ష్మికి అలవాటు. స్థానిక కాలనీలో నీరు రాకపోయినా, రోడ్లు బాగాలేకపోయినా.. వీధి దీపాలు.. ఇలా సమస్య ఏదైనా స్థానికులతో కలిసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేది. తను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన ఒక ఎన్జీఓ సంస్థ తమతో కలిసి సేవ చేయమని చేర్చుకుంది. కాలనీల్లో యువతులకు రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య అంశాలు, బాల్య వివాహాలు చేసుకోకుండా అవగాహన కల్పిస్తూ ఉండేది.
SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది'
Children Parliament PM Jaya Lakshmi Journey : పిల్లలంతా కలిసి నాయకులను ఎన్నుకుని స్థానికంగా ఉండే సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ఏర్పడిందే చిల్డ్రన్స్ పార్లమెంట్. దీనికి హైదరాబాద్ తరపున ప్రధానిగా జయలక్ష్మి ఎన్నికయ్యారు. అయితే ఈ చిల్డ్రన్ పార్లమెంట్ ద్వారా ఎన్నో సాధించుకున్నామని వాటిలో మచ్చుతునకలాంటిది అంగన్వాడీలు ఏర్పాటు చేయించుకోవటం. 21 మురికివాడల్లో అండన్వాడీలు లేవని గుర్తించిన వీరు.. చిన్నపిల్లలకు అల్పాహారం అందించకపోవడం, కేంద్రాల సంఖ్య కూడా తక్కువ ఉన్నాయని తెలుసుకుని స్థానికులతో కలసి శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.